భీముని గుట్టపై వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి జాతర

ఇవాళ మాఘ అమావాస్య. ఈ సందర్భంగా కొన్ని ఆలయాల్లో పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిందూ ఆచారాల్లో మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మాఘ మాసంలో అమావాస్య నాడు వచ్చే ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలోని భీముని గుట్టపై శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య జాతర అత్యంత వైభోపేతంగా జరుగుతోంది. ఈ జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు.

భీముని గుట్టపై శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతమంతా ఒక అద్భుతంలా అనిపిస్తుంది. తళతళా మెరిసే బండలు, చుట్టు గుట్టలు, పచ్చని పొలాలు, పారే జలపాతం, ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ ఉంటుంది. ఈ ఆలయం ఈనాటిది కాదు.. కాకతీయుల కాలం నాటిది. కాకతీయుల కళా వైభవాన్ని చాటే రెండంతస్తుల అపురూప రాతి కట్టడం. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. దీనికి అభిముఖంగా శ్రీ రాముడి గుడి ఉంటుంది. హనుమంతుడి కంటి కాంతి కిరణాలు రాముని పాదాలని ఎల్లవేళలా స్మృశించేలా చేసిన ఆ తీరు మహా అద్భుతంగా ఉంటుంది.

Share this post with your friends