ఇవాళ తెప్పలపై విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామివారు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి నిన్న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకూ తెప్పలపై విహరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పలపై విహరించనున్నారు. ఈ నెల 21 వరకూ ఈ తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ నాలుగు రోజుల పాటు అమ్మవారు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ పద్మసరోవరంలో తెప్పలపై విహరించనున్నారు. శ్రీ అలమేలు మంగమ్మ ఈ ఉత్సవాల్లో పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుంటారు.

ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ తెప్పోత్సవాలు.. ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ తెప్పోత్సవాల్లో ఎవరైతే భక్తులు పాల్గొంటారో వారికి తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అలమేలు మంగమ్మ.. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి జీవకోటికి మాతృమూర్తిగా మారుతుందట. తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, జూన్ 21న ల‌క్ష్మీ పూజ‌ను రద్దు చేశారు.

Share this post with your friends