తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ హోమం మూడు రోజుల పాటు జరగనుంది కాబట్టి నేడు, రేపు కూడా జరుగనుంది. నవంబరు 6, 7వ తేదీల్లో కూడా శ్రీ సుబ్రమణ్య స్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా నవంబరు 7న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలక్రిష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.