ప్రయాగ్‌రాజ్‌లో శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. మహా కుంభమేళా సందర్భంగా దేవరియాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానంవారు ప్రయాగ్ రాజ్‌లోని సెక్టార్-8లో ఏర్పాటు చేసిన భక్తి వాటికా సేవా శిబిరంలో ఈ కల్యాణం జరిపించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ రాజేష్ దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఈ కల్యాణాన్ని నిర్వహించడం జరిగింది.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీరామానుజాచార్యస్వామి రాజనారాయణాచార్య, హెచ్ డీపీపీ అడిషనల్ సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.