అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 9.25 నుంచి 11 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇక ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధనగిరిదారుడి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.
ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక నిన్న సాయంత్రం చంద్రప్రభ వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం భక్తులకు లభించింది. ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు . ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు.