అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.నిన్న ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుండి 10.45 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.