ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నుల పండువగా చేపట్టారు.

సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు. ఇక ఇవాళ స్వామివారికి తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కవచాన్ని వచ్చే ఏడాది వరకూ ఉంచుతారు.

Share this post with your friends