గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ జరిగింది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహనసేవలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివి అండ్ ఎస్ ఓ శ్రీ శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైంది గరుడవాహన సేవ. గరుడ వాహనంపై ఊరేగే స్వామిని దర్శించుకునే భక్తులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. గరుడ వాహన సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే.. ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. అసలు ఈ గరుత్మంతుడి ప్రత్యేకత ఏంటంటే.. సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతాడట. కాబట్టి గరుడ వాహన సేవకు అంతటి విశిష్ట స్థానం ఉంది. ఇక గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలను ధరింపజేస్తారు. మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. అనంతరం సర్వాలంకార భూషితుడైన స్వామివారు ప్రసన్న వదనుడిగా శ్రీదేవి, భూదేవి లతో కలిసి గరుత్మంతుడిపై ఊరేగుతాడు.