ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్ర వారం అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ ఈవో పరిశీలించారు.
కొన్ని ముఖ్యాంశాలు:
రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
వాహనం వివరాలు:
ఉదయం 5.30 – 8 గంటల వరకు (సూర్యోదయం 6.44) – సూర్య ప్రభ వాహనం
ఉదయం 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం