తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వాహన సేవలను టీటీడీ నిర్వహించింది. ఉదయాన్నే సూర్యప్రభ వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. నాలుగో వాహనమైన హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది.
తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఆ తరువాత హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులను కరుణించారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.