శ్రీ క్రోధినామ సంవత్సరం (2024 – 2025) ఉగాది రాశిఫలాలు

మేషరాశి
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :
ఆదాయం : 8 || వ్యయం : 14 || రాజపూజ్యం : 4 || అవమానం : 3

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – ఒకటోస్థానం (దోషం)
మే 1 నుంచి – రెండో స్థానం (శుభం)
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధగా పనిచేయాలి. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మే 1 నుంచి గురుబలం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా పదకొండో స్థానం (లాభం)
చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలుంటాయి.
రాహువు : ఈ ఏడాదంతటా పన్నెండో స్థానం (దోషం)
చేపట్టే పనులు ఆలస్యం కావచ్చు. కంటి సమస్యలు కొంతమేర ఇబ్బంది కలిగిస్తాయి. విదేశీయానానికి అనుకూలం. నిత్యం రాహు ధ్యానం శ్లోకం పఠించండి. ఒకసారి మినుములు దానం చేయండి.
కేతువు : ఈ ఏడాదంతటా ఆరోస్థానం (శుభం)
ధైర్యంగా వ్యవహరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభపరిణామాలు. భూలాభాలకు ఆస్కారం.

నక్షత్రం.. పరిహారం

అశ్విని (1, 2, 3, 4 పాదాలు) : ఏడాది అంతటా సానుకూలంగా ఉంటుంది. ద్వితీయార్ధం కాస్త ఇబ్బందికరం. హఠాత్తుగా ఆనందకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో శుభపరిణామాలు ఉంటాయి. మాట పట్టింపులతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ప్రదోషకాల దుర్గార్చన, లలితాసహస్ర పారాయణ, పూర్ణిమ తిథుల్లో దేవతారాధన చేయడం శుభప్రదం.
భరణి (1, 2, 3, 4 పాదాలు) : ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణ, నాగదేవతారాధన, దత్తాత్రేయ దర్శనం మేలు చేస్తాయి.
కృత్తిక (1వ పాదం) : ఆర్ధికంగా బాగుంటుంది. ఆకస్మిక విజయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. న్యాయ సంబంధ అంశాల్లో విజయం. రుద్రాభిషేకం, శివారాధన, సుబ్రహ్మణ్యారాధన శుభకరంగా ఉంటుంది.

అదృష్టయోగం 75%

నాలుగింట రెండువంతుల గ్రహబలం ఉంది. లక్ష్య సాధనకు అనుకూలమైన కాలమిది. శుభకార్యాలను నిర్వహించడానికి తగిన తరుణం. పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా కొంచెం బాగుంటుంది. భవిష్యత్ ప్రణాళికలకు మంచి సమయం. శివారాధన చేసుకోండి. మేలు జరుగుతుంది.

వృషభరాశి
(కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
ఆదాయం : 2 || వ్యయం : 8 || రాజపూజ్యం : 7 || అవమానం : 3

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – పన్నెండోస్థానం (వ్యయం)
మే 1 నుంచి – ఒకటో స్థానం (దోషం)
ఏడాదంతటా గురు బలం లేదు. ధనవ్యయం అధికంగా ఉంటుంది. మే 1 నుంచి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. తగాదాలకు దూరంగా ఉండాలి. మాట విలువ కాపాడుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పడకూడదు. నిత్యం గురు ధ్యాన శ్లోకం పఠించండి. వీలున్నప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా పదోస్థానం (దోషం)
కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించినా ఎదుర్కొంటారు. శ్రమ అధికం. వృత్తిలో ఆటంకాలు ఎదురైనా శ్రద్ధగా పనిచేయాలి. నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించండి. నువ్వుల దానం, శనికి తైలాభిషేకం చేయండి.
రాహువు : ఈ ఏడాదంతటా పదకొండో స్థానం (లాభం)
వస్తు, వస్త్ర ప్రాప్తి కలుగుతాయి. విజయాలు సిద్ధిస్తాయి. మీ మీ రంగాల్లో లాభాలు చేకూరుతాయి. భోజన సౌఖ్యం ఉంటుంది.
కేతువు : ఈ ఏడాదంతటా ఐదో స్థానం (దోషం)
కుటుంబసభ్యులతో గొడవలు రాకుండా చూసుకోండి. ముఖ్యమైన విషయాల్లో సంయమనంతో వ్యవహరించండి. ప్రతిరోజూ కేతుధ్యాన శ్లోకం పఠించండి. ఒకసారి ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

కృత్తిక (2, 3, 4 పాదాలు) : ఇంటా బయట మంచి పేరు సంపాదిస్తారు. ఆర్ధిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు నిర్వహించడానికి అనువైన కాలం. ఖర్చులు పెరుగుతాయి. ప్రతీదానికి తొందరపాటు వద్దు. ఆదిత్య హృదయం పఠించండి. ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయండి.
రోహిణి (1,2,3, 4 పాదాలు) : అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మంచి – చెడుల మిశ్రమంగా జీవనం సాగుతుంది. స్థానచలన సూచనలు. ఆర్థికంగా కొంతమేర కలిసివస్తుంది. శుభకార్య సిద్ధి, శివ, సూర్యారాధనలు మేలు చేస్తాయి. లక్ష్మీదేవి ఆరాధనతో మరిన్ని శుభాలు.
మృగశిర (1, 2 పాదాలు) : వృత్తి వ్యాపారాల్లో కొంతమేర అభివృద్ధి ఉంటుంది. కుటుంబసౌఖ్యానికి ప్రాధాన్యతనిస్తారు. వృత్తి వ్యాపారాలను నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి పెంచుకుంటారు. ఆంజనేయ దండకం పఠించండి. దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి అనుష్ఠానం ఉపకరిస్తుంది.

అదృష్టయోగం 25%

నాలుగింట ఒక వంతు గ్రహబలం ఉంది. శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించండి. ద్వితీయార్ధంలో కాస్త ధనలాభం కలుగుతుంది. కాలంతో పోటీ పడండి. కాస్తంత కష్టపడితే విజయం మీదే అవుతుంది. గురువారాల్లో దక్షిణామూర్తి దర్శనం చేయండి.

మిథునరాశి
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఆదాయం : 5 || వ్యయం : 5 || రాజపూజ్యం : 3 || అవమానం : 6

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – పదకొండో స్థానం (లాభం)
మే 1 నుంచి – పన్నెండో స్థానం (వ్యయం) సుదీర్ఘ
సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శత్రువులపై విజయం కలుగుతుంది. అన్నింటా విజయాలు పొందుతారు. ఆరోగ్యం కొంతమేరకు అనుకూలిస్తుంది. మే 1నుంచి ధనవ్యయం అధికమవుతుంది. స్థానచలనం సూచితం అవుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా గురుధ్యాన శ్లోకం పఠించండి. వీలైనప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా తొమ్మిదోస్థానం (దోషం)
శ్రమ అధికం అవుతుంది. కుటుంబసభ్యులకు అనారోగ్య సూచనలున్నాయి. కొంతమేరకు మాత్రమే ధనలాభం ఉంటుంది. విదేశీయానాలకు అనుకూలం. శివ – శని క్షేత్రాల దర్శనం మేలు.
రాహువు : ఈ ఏడాదంతటా పదో స్థానం (శుభం)
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
కేతువు : ఈ ఏడాదంతటా నాలుగో స్థానం (దోషం)
ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తరచుగా అకాల భోజనం చేస్తుంటారు. గొడవలకు దూరంగా ఉండాలి. ఒకసారి ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

మృగశిర (3, 4 పాదాలు) : ఏడాదంతటా సామాన్య ఫలితాలు ఉంటాయి. అతిగా ఆశించి మోసపోకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహా, సహకారం తీసుకోండి. ప్రతీ చిన్న విషయానికి ఆవేశాలకు లోనుకావద్దు. సుబ్రహ్మణ్యారాధన మేలు చేస్తుంది. బుధవారాల్లో ఉపవాసం చేయడం శుభప్రదం.
ఆరుద్ర (1, 2, 3, 4 పాదాలు) : ఇంటా బయట గౌరవమర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అవసరం. వృత్తి ఉద్యోగాల్లో సంయమనం పాటించండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. విష్ణుసహస్ర పారాయణ, నవగ్రహారాధన మేలు చేస్తాయి.
పునర్వసు (1, 2, 3 పాదాలు) : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబసౌఖ్యం పెరుగుతుంది. గోసేవ, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తాయి.

అదృష్టయోగం 50%

మిశ్రమ గ్రహయోగం. నాలుగింట ఒక వంతు గ్రహబలం ఉంది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించండి. అనుకున్నది నెరవేరాలంటే బాగా కష్టపడాలి. పొదుపు సూత్రం పాటించడం తప్పనిసరి సూచన. వివాహ ఘడియలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మంగళవారాల్లో సుబ్రహ్మణ్యుని దర్శించండి.

కర్కాటకరాశి
(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం : 14 || వ్యయం : 2 || రాజపూజ్యం : 6 || అవమానం : 6

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – పదోస్థానం (దోషం)
మే 1 నుంచి – పదకొండో స్థానం (లాభం)
మే 1 వరకు ఆర్ధిక జాగ్రత్తలు పాటించడం అవసరం. వృధా ప్రయాణాలు చేస్తారు. బృహస్పతి లాభస్థానంలోకి మారాక.. సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గుర్తింపు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా ఎనిమిదో స్థానం (దోషం)
అష్టమ శనిదోషం నడుస్తోంది. వచ్చే ఉగాదికి ముందురోజు ముగుస్తుంది. అష్టమశని కారణంగా పనులు నిదానిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఆర్థిక నియంత్రణ పాటించండి. నిత్యం శనిధ్యానశ్లోకం పఠించండి.
రాహువు : ఈ ఏడాదంతటా తొమ్మిదోస్థానం (దోషం)
పనులు నిదానంగా పూర్తవుతాయి. సంయమనం అవసరం. నిత్యం రాహు ధ్యాన శ్లోకం పఠించండి. వీలున్నప్పుడు మినుములు దానం చేయండి
కేతువు : ఈ ఏడాదంతటా మూడో స్థానం (శుభం)
ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కీర్తి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. కేతుధ్యానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

పునర్వసు (నాలుగో పాదం) : సామాన్య ఫలితాలు అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. రుణాల నుంచి విముక్తి పొందుతారు. ఈశ్వరాభిషేకంతో శుభాలు చేకూరుతాయి.
పుష్యమి (1, 2, 3, 4 పాదాలు) : వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దక్షిణామూర్తి ఆరాధన, నృసింహ స్తోత్ర పారాయణ చేయండి.
ఆశ్లేష (1, 2, 3, 4 పాదాలు) : నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. దుర్గాదేవి ఆరాధన, గణపతి దర్శనం మేలు చేస్తాయి.

అదృష్టయోగం 50%

కొంచెం ఇష్టం… కొంచెం కష్టం అన్నట్టుగా మిశ్రమ ఫలితాలుంటాయి. నాలుగింట రెండు వంతుల గ్రహబలం ఉంది. కష్టేఫలి అన్నట్లుగా మీ కష్టానికి తగినట్లుగా విజయం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరైన సంవత్సరమిది. అష్టమశని ఉంది. దానధర్మాలు చేస్తూ ఉండండి. హనుమంతుని ఆరాధించండి.

సింహరాశి
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆదాయం : 2 || వ్యయం : 14 || రాజపూజ్యం : 2 || అవమానం : 2

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – తొమ్మిదో స్థానం (శుభం)
మే 1 నుంచి – పదో స్థానం (దోషం)
ఆర్థిక అనుకూలతలు ఉంటాయి. ఆస్తి వృద్ధి చేసే అవకాశం కలుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. మే 1 నుంచి విజయాలు సాధించడంలో విఘ్నాలు ఏర్పడతాయి. పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. గురు ధ్యాన శ్లోకం పఠించండి. వీలైనప్పుడు శనగలు దానం చేయండి. దక్షిణామూర్తిని ధ్యానించండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా ఏడో స్థానం (దోషం)
ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విదేశీయానాలు అనుకూలిస్తాయి. శనివార నియమాలు పాటించండి. వీలైనప్పుడు నువ్వులు దానం చేయండి.
రాహువు : ఈ ఏడాదంతటా ఎనిమిదో స్థానం (దోషం)
అష్టమ రాహు కారణంగా మనోవిచార సూచనలు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు అధికం. నిత్యం రాహు ధ్యాన శ్లోకం పఠించండి. ఒకసారి మినుములు దానం చేయండి.
కేతువు : ఈ ఏడాదంతటా రెండో స్థానం (దోషం)
మాట పొదుపు పాటించాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్త వహించాలి. మధ్యవర్తిత్వాలు వహించకూడదు. ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

మఘ (1, 2, 3, 4 పాదాలు) : పట్టుదలతోనే లక్ష్యాలు చేరుకోగలరు. నిర్లక్ష్యమే మీ ప్రధాన శత్రువు. నూతన కార్యాలు చేపట్టి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దక్షిణామూర్తి దర్శనం మేలు చేస్తుంది.
పుబ్బ (1, 2, 3, 4 పాదాలు [పూర్వఫల్గుణి]) : కోపాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. నూతన కార్యసిద్ధి. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. నృసింహ స్తోత్ర పారాయణ, శనికి తైలాభిషేకం చేయించడం శుభప్రదం.
ఉత్తర (ఒకటో పాదం [ఉత్తర ఫల్గుణి]) : విదేశీ యానాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలు స్వల్పం. ఖర్చులు అధికంగా ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. వృత్తిఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన, కులదేవతా దర్శనం చేయండి.

అదృష్టయోగం 25%

మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్యం – ఆర్థికం – జీవనాధారం అన్నింటిపైనా శ్రద్ధ వహించాలి. విజయసిద్ధికి బాగా శ్రమించాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. శ్రమతో విజయాలు సాధిస్తారు. శివారాధనతో మీకు శుభాలు కలుగుతాయి.

కన్యారాశి
(ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఆదాయం : 5 || వ్యయం : 5 || రాజపూజ్యం : 5 || అవమానం : 2

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – ఎనిమిదో స్థానం (దోషం)
మే 1 నుంచి – తొమ్మిదో స్థానం (శుభం)
ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం అవసరం. పనులు వాయిదా పడతాయి. ఆగ్రహావేశాలు వద్దు. మే 1 నుంచి ఆర్థిక అనుకూలతలు ఉంటాయి. ధన లాభం కలుగుతుంది. గృహయోగానికి సరైన కాలమిది. ఆస్తి వృద్ధి చేసే అవకాశం దొరుకుతుంది. కొన్ని చికాకులు ఎదురైనా సుఖసంతోషాలుంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా ఆరోస్థానం (శుభం)
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి. గృహయోగానికి అనుకూల కాలమిది.
రాహువు : ఈ ఏడాదంతటా ఏడోస్థానం (దోషం)
స్వల్ప లాభాలు ఉన్నప్పటికీ వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్వల్ప ధనలాభం మాత్రం సూచితం అవుతోంది. రాహుశ్లోకం పఠించండి. మినుములు దానం చేయండి.
కేతువు : ఈ ఏడాదంతటా ఒకటోస్థానం (దోషం)
ఆర్థిక, ఆరోగ్య విషయాల్లోనూ… వివాదాలపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కేతు ధ్యాన శ్లోకం పఠించాలి. వీలున్నప్పుడు ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

ఉత్తర (2, 3, 4 పాదాలు) : ద్వితీయార్థంలో శుభాలు పొందుతారు. ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. శివాలయ దర్శనం, సూర్యోపాసన మేలు చేస్తాయి.
హస్త (1, 2, 3, 4 పాదాలు) : ఆర్థికపరమైన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబసభ్యులతో సంయమనం పాటించాలి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆది మంగళవార నియమాలు, సుందరకాండ పారాయణ శుభప్రదం.
చిత్ర (1, 2 పాదాలు) : విదేశీ ప్రయాణాలు అనుకూలం. ఆర్థికపరంగా జాగ్రత్తలు పాటించాల్సిన సంవత్సరం ముఖ్యమైన విషయాల్లో పెద్దల సహకారంతో మంచి జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన, గోసేవ మేలు చేస్తాయి.

అదృష్టయోగం 50%

ఎంతో కొంత మంచి జరిగే సంవత్సరమిది. నాలుగింట రెండు వంతుల గ్రహబలం. ఏదీ ఊరికే రాదని గుర్తుంచుకోండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. శుభాశుభ ఫలితాల్లో మంచే ఎక్కువగా ఉంటుంది. దుర్గాదేవి దర్శనం శుభప్రద ఫలితాలనిస్తుంది.

తులారాశి
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
ఆదాయం : 2 || వ్యయం : 8 || రాజపూజ్యం : 1 || అవమానం : 5

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – ఏడోస్థానం (శుభం)
మే 1 నుంచి – ఎనిమిదో స్థానం (దోషం)
సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మే 1నుంచి అష్టమ గురు దోషం ప్రారంభమయ్యాక ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం అవసరం. పనులు వాయిదా పడే అవకాశం. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిత్యం గురు ధ్యాన శ్లోకం పఠించండి. వీలున్నప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా ఐదోస్థానం (దోషం)
అనుకున్న పనులు పూర్తికావడానికి సమయం పడుతుంది. పనులు పూర్తి కావడం లేదని చికాకు పడవద్దు. అలాగని అసలే మానవద్దు, జాగ్రత్త వహించండి. ఇబ్బందులు అధిగమించాల్సి ఉంటుంది. శని ధ్యాన శ్లోకం పఠించండి. పరిహారాలు పాటించండి.
రాహువు : ఈ ఏడాదంతటా ఆరోస్థానం (శుభం)
ధైర్యంగా వ్యవహరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మంచి పనులు చేస్తారు. భూలాభాలకు ఆస్కారం ఉంటుంది.
కేతువు : ఈ ఏడాదంతటా పన్నెండోస్థానం (వ్యయం)
ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. విదేశీయానం సూచితం అవుతోంది. వీలైతే ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

చిత్ర (3, 4 పాదాలు) : ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల సహకారం తీసుకోండి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శివాలయ ప్రదక్షిణలు, శని స్తోత్ర పారాయణం, స్వయంపాక దానంతో గ్రహశాంతి జరుగుతుంది.
స్వాతి (1, 2, 3, 4 పాదాలు) : ఆర్థికపరమైన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఆడంబరాలకు దూరంగా ఉండండి. శ్రమ అధికం. సంబంధం లేని వ్యవహారాలతో విరోధాలు. ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ, గోసేవ, నవగ్రహ ఆరాధనతో మేలు జరుగుతుంది.
విశాఖ (1, 2, 3 పాదాలు) : శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు – ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, ఇష్టదేవతా స్మరణం శుభప్రదం.

అదృష్టయోగం 50%

మిశ్రమ ఫలితాల సంవత్సరం, ప్రథమార్థం కంటే ద్వితీయార్ధం బాగుంటుంది. సంయమనంతో విజయాలు సాధించాలి. అనుకూల పరిస్థితులను కల్పించుకోవాలి. ఆర్థికంగా స్వల్ప ప్రయోజనాలు దక్కుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దక్షిణామూర్తి ధ్యానం చేయండి.

వృశ్చికరాశి
(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
ఆదాయం : 8 || వ్యయం : 14 || రాజపూజ్యం : 4 || అవమానం : 5

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – ఆరోస్థానం (దోషం)
మే 1 నుంచి – ఏదోస్థానం (శుభం)
ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. నిత్యం గురు ధ్యాన శ్లోకం పఠించాలి. బృహస్పతి ఏడోస్థానంలోకి మారాక… కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆనందకర వాతావరణం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా నాలుగో స్థానం (దోషం)
ఈ ఏడాది చివరివరకు అర్ధాష్టమశని దోషం నడుస్తుంది. శని నాలుగో ఇంట ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పనులు ఆలస్యమైనా పూర్తిచేస్తారు. శని ధ్యాన శ్లోకం పఠించండి. పరిహారాలు పాటించండి.
రాహువు : ఈ ఏడాదంతటా ఐదోస్థానం (దోషం)
చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ స్వల్పగౌరవం, సన్మానాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. నిత్యం రాహు ధ్యాన శ్లోకం పఠించండి. మినుములు దానం చేయండి.
కేతువు : ఈ ఏడాదంతటా పదకొండోస్థానం (లాభం)
లాభదాయకంగా ఉంటుంది. నూతన వస్తువస్త్రప్రాప్తి, విజయసిద్ధి. విందువినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు.

నక్షత్రం.. పరిహారం

విశాఖ (నాలుగో పాదం) : శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభమూలక కార్యసిద్ధి కలుగుతుంది. అధిక ధనవ్యయం చేయాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యారాధన, విష్ణు సహస్ర పారాయణ శుభప్రదం.
అనూరాధ (1, 2, 3, 4 పాదాలు) : సంతాన వివాద – ఉద్యోగాది శుభాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దేవతా క్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. రుణ బాధా విముక్తి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ, లింగార్చన, గిరిప్రదక్షిణ శుభప్రదం.
జ్యేష్ణ (1, 2, 3, 4 పాదాలు) : ధనవ్యయం, స్థానచలనం సూచితమవుతున్నాయి. ఆకస్మిక శుభయోగాలున్నాయి. కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీమీ రంగాల్లో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. ఫలపుష్పదానం మీకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేస్తుంది.

అదృష్టయోగం 50%

గతం కంటే మేలైన ఫలితాలు పొందుతారు. ఈ ఏడాదితో అర్ధాష్టమ శనిదోషం పూర్తవుతుంది. గురుబలం యోగిస్తుండటంతో మంచి విజయాలు అందుకుంటారు. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగుంటుంది. ఎంతోకొంత సానుకూల సంవత్సరమిది. అష్టమశని పరిహారానికి తరచూ ఆంజనేయ దర్శనం చేయండి.

ధనుస్సురాశి
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం : 11 || వ్యయం : 5 || రాజపూజ్యం : 7 || అవమానం : 5

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – ఐదోస్థానం (శుభం)
మే 1 నుంచి – ఆరోస్థానం (దోషం)
కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూలతలున్నాయి. మే 1నుంచి గురువు దోషస్థానంలో ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. ఆలోచించకుండా ఏ పనినీ మూర్ఖంగా మొదలుపెట్టవద్దు. నిత్యం గురుధ్యాన శ్లోకం పఠించండి. వీలైనప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా మూడో స్థానం (శుభం)
శని మూడోస్థానంలో ఉన్నప్పుడు శుభాలు అనుగ్రహిస్తాడు. బుద్ధిబలం అనుకూలిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన ఆటుపోట్లు అధిగమిస్తారు. మంచి ఫలితాలు పొందుతారు.
రాహువు : ఈ ఏడాదంతటా నాలుగోస్థానం (దోషం)
మనస్సు నిశ్చలంగా ఉంచుకోవాలి. అన్ని విషయాల్లోనూ సంయమనం పాటించాలి. రాహుశ్లోకం పఠించండి. మినుములు దానం చేయాలి.
కేతువు : ఈ ఏడాదంతటా పదోస్థానం (శుభం)
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సర్వత్రా శుభం జరుగుతుంది.

నక్షత్రం.. పరిహారం

మూల (1, 2, 3, 4 పాదాలు) : ద్వితీయార్థంలో మంచి విజయాలు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధిక ధనవ్యయం సూచితమవుతోంది. ముందు జాగ్రత్తలు పాటించండి. అనవసర వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన, లలితా సహస్ర పారాయణ శుభప్రదం.
పూర్వాషాఢ (1, 2, 3, 4 పాదాలు) : మిశ్రమ ప్రయోజనాలు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. రుణ విముక్తి కలుగుతుంది. కొందరి కారణంగా కీర్తి భంగానికి ఆస్కారముంది. దుర్గాదేవి ఆరాధన, గణపతి పూజ మేలు.
ఉత్తరాషాఢ (ఒకటో పాదం) : మీ సొంత బుద్ధిబలానికి ప్రాధాన్యతనివ్వాలి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి ఆరాధన, గురు దర్శనం శుభప్రదంగా ఉంటుంది.

అదృష్టయోగం 75%

అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంవత్సరమిది. కొన్ని శుభాలు జరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయండి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. కష్టపడి పనిచేయండి. పనికి తగిన ప్రతిఫలం కచ్చితంగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలించినా ఖర్చులు నియంత్రించుకోండి. దుర్గాదేవి ఆరాధన, గురు దర్శనం మేలు.

మకరరాశి
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
ఆదాయం : 14 || వ్యయం : 14 || రాజపూజ్యం : 3 || అవమానం : 1

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – నాలుగో స్థానం (దోషం)
మే 1 నుంచి – ఐదో స్థానం (శుభం)
ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మే 1నుంచి కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. అవసరానికి తగిన ఆర్థిక అనుకూలతలుంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా రెండో స్థానం (దోషం)
ఏలినాటి శనిదోషం కొనసాగుతోంది. ఏ పనైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రారంభించాలి. మనసును చెడుమార్గంవైపు మళ్లించవద్దు. మాట పొదుపు ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శనివార నియమాలు పాటించండి. శనైశ్చరునికి తైలాభిషేకం నవగ్రహ ప్రదక్షిణలతో మేలు కలుగుతుంది.
రాహువు : ఈ ఏడాదంతటా మూడో స్థానం (శుభం)
ధనలాభం, కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలు పొందుతారు.
కేతువు : ఈ ఏడాదంతటా తొమ్మిదోస్థానం (దోషం)
ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలు అధికం. నిత్యం కేతు ధ్యాన శ్లోకం పఠించండి. ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు) : ఆదాయమార్గాలు అనుకూలిస్తాయి. కొత్తమార్గాల్లో ధనసంపాదన చేస్తారు. సంతానపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. మొత్తంగా స్వల్ప శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్ర పారాయణ, ఆంజనేయ దర్శనంతో మేలు కలుగుతుంది.
శ్రవణం (1, 2, 3, 4 పాదాలు) : ఆర్థికంగా సామాన్య ఫలితాలుంటాయి. భవిష్యత్తు అభివృద్ధిపథంలో ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం. తోడ్పడుతుంది. ఆకస్మిక ధనవ్యయం చేయాల్సి వస్తుంది. దత్త చరిత్ర పారాయణ, తీపిపదార్ధాల దానం శుభప్రదం.
ధనిష్ట (1, 2 పాదాలు) : ఆర్థిక – ఆరోగ్య క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ప్రశంసలు – పురస్కారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలతో వృధా ప్రయాస కలగవచ్చు. దుర్గాదేవి ఆరాధన, గణపతి దర్శనంతో శుభాలు కలుగుతాయి.

అదృష్టయోగం 50%

గురుయోగం కారణంగా ఈ ఏడాది ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. ఏలినాటిశనిదోషం నడుస్తున్నా ఇతర గ్రహయోగాల కారణంగా మేలు జరుగుతుంది. ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. దైవబలంతో మేలు జరుగుతుంది. తరుచూ ఈశ్వరారాధన, అభిషేకాలు చేయండి. శనివార నియమాలు పాటిస్తూ ఆంజనేయ దర్శనం చేసుకోండి.

కుంభరాశి
(ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ఆదాయం : 14 || వ్యయం : 14 || రాజపూజ్యం : 6 || అవమానం : 1

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – మూడోస్థానం (దోషం)
మే 1 నుంచి – నాలుగోస్థానం (దోషం)
మాట విలువ కాపాడుకోవాలి. శ్రమిస్తేనే సానుకూల ఫలితాలు సాధించగలరు. ఆర్థిక జాగ్రత్తలు అవసరం. మే 1నుంచి కొత్త పనుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఆరోగ్యపరమైన అంశాల్లో శ్రద్ధ చూపాలి. విదేశీ ప్రయాణాలు మాత్రం ఫలిస్తాయి. నిత్యం గురు ధ్యాన శ్లోకం పఠించాలి. వీలైనప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా ఒక స్థానం (దోషం)
ఏలినాటి శనిదోషం కొనసాగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. అపకీర్తి రాకుండా వ్యవహరించాలి. ఆర్థిక నియంత్రణ పాటించాలి. నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించండి. శని దోష పరిహారాలు ఆచరించండి.
రాహువు : ఈ ఏడాదంతటా రెండో స్థానం (దోషం)
ఆటంకాలు ఎదురవుతాయి. సహనంతో అధిగమించాల్సి ఉంటుంది. మాట పొదువు అవసరం. మినుములు దానం చేయండి.
కేతువు : ఈ ఏడాదంతటా ఎనిమిదో స్థానం (దోషం)
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రతికూల పరిస్థితుల విషయంలో సంయమనం అవసరం. ప్రయాణాలు అధికం. కేతు ధ్యాన శ్లోకం పఠించండి. ఉలవలు దానం చేయండి.

నక్షత్రం… పరిహారం

ధనిష్ఠ (3, 4 పాదాలు) : కుటుంబ సౌఖ్యం. ఆకస్మిక ధనవ్యయం. స్థాన చలనం. సంఘంలో కీర్తి ప్రతిష్టల వృద్ధి, సంతానపరమైన శుభపరిణామాలు. విష్ణు సహస్ర పారాయణతో శుభాలు.
శతభిషం (1, 2, 3, 4 పాదాలు) : బంధుమిత్రుల సహకారంతో కార్యసిద్ధి, నూతన వస్తు యోగం. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు, స్థాన మార్పులుంటాయి. రామరక్షాస్తోత్ర పారాయణ, గిరి ప్రదక్షిణ, పశుపక్ష్యాదులకు ఆహార వితరణ శుభప్రదం.
పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు) : శారీరక శ్రమ అధికం. కుటుంబ సౌఖ్యం, ఆటంకాలు ఎదురైనా విజయసిద్ధి, అనవసర కోపాలు, దుర్గా గణపతి ఆరాధనలు, కంచుపాత్ర దానంతో శుభాలు కలుగుతాయి.

అదృష్టయోగం 25%

గ్రహబలం అంతగా లేకపోయినా శుభఫలితాలూ పొందుతారు. ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కొంతమేర అనుకూలిస్తుంది. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. ఆర్థిక జాగ్రత్తలు పాటించాలి. దత్తస్తోత్రం శుభప్రదం.

మీనరాశి
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం : 11 || వ్యయం : 5 || రాజపూజ్యం : 2 || అవమానం : 4

గ్రహయోగం

బృహస్పతి : ఏప్రిల్ 30 వరకు – రెండో స్థానం (శుభం)
మే 1 నుంచి – మూడో స్థానం (దోషం)
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మూడో స్థానంలోకి మారాక.. మాట విలువను కాపాడుకోవాలి. శ్రమిస్తేనే సానుకూల ఫలితాలు సాధించగలరు. ఆర్థిక జాగ్రత్తలు అవసరం. ఓర్పు అంతకంటే అవసరం. ప్రతిరోజూ గురు ధ్యాన శ్లోకం పఠించండి. వీలైనప్పుడు శనగలు దానం చేయండి.
శనైశ్చరుడు : ఈ ఏడాదంతటా పన్నెండో స్థానం (దోషం)
ఏలినాటిశని దోషం నడుస్తోంది. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ, అనారోగ్య సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించాలి. శనైశ్చరునికి తైలాభిషేకం – నువ్వుల దానం చేయండి. శివాభిషేకం కూడా మేలు చేస్తుంది
రాహువు : ఈ ఏడాదంతటా ఒకటో స్థానం (దోషం)
ఆటంకాలు ఎదురవుతాయి. సహనంతో అధిగమించాల్సి ఉంటుంది. విదేశీయానం మాత్రం అనుకూలం. నిత్యం రాహు ధ్యాన శ్లోకం పఠించండి. వీలైనప్పుడు మినుములు దానమివ్వండి.
కేతువు : ఈ ఏడాదంతటా ఏడో స్థానం (దోషం)
స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. చికాకులకు దూరంగా ఉండండి. నిత్యం కేతు శ్లోకం పఠించండి. ఉలవలు దానం చేయండి.

నక్షత్రం.. పరిహారం

పూర్వాభాద్ర (నాలుగో పాదం) : శ్రమ – పట్టుదలతో అనుకూలతలు పెంచుకుంటారు. కీడెంచి మేలెంచాలనే సూత్రాన్ని పాటిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. శివారాధన దుర్గాదేవి దర్శనం మేలు చేస్తాయి.
ఉత్తరాభాద్ర (1, 2, 3, 4 పాదాలు) : సామాన్య ఫలితాలుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర ధనవ్యయ సూచితం అవుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర దర్శనం, దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
రేవతి (1, 2, 3, 4 పాదాలు) : మిశ్రమ ఫలితాలుంటాయి. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. శుభమూలక ధనవ్యయం. ఆంజనేయ దర్శనం, గుమ్మడికాయ దానం, శనివార నియమాలు పాటించాలి.

అదృష్టయోగం 30%

మిశ్రమ ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలో కొంత సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలుంటాయి. గతంలో కంటే ఉత్సాహపూరితమైన పరిస్థితులు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసమే మీ బలం అని గ్రహించండి. శ్రీవేంకటేశ్వర దర్శనంతో శుభాలుంటాయి.

Share this post with your friends