కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఏప్రిల్ 14న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 15న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

Share this post with your friends