తిరుమల శ్రీ వేంకటటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం మూలమని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యులలో ఒకరైన శ్రీ కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథంతో శాస్త్రాధ్యయనం చేసి సమాజానికి సేవచేయాలన్నారు. శ్రీవిఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ.. ఆలయ సంస్కృతికి ఆధారమైన ఆగమశాస్త్రాల పరిరక్షణ సమాజం బాధ్యతగా స్వీకరించాలని, జ్ఞానాన్ని అందించిన మహర్షుల జయంతులను పండుగలుగా జరుపుకుంటూ, ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ, భగవద్దర్శనంతో ప్రశాంత జీవనం పొందాలన్నారు.
శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ, పూర్వ కాలంలో అవతరించిన శ్రీ శ్రీ విఖనస మహర్షి, శ్రీ భృగు, శ్రీ అత్రి, శ్రీ మరీచి, శ్రీ కశ్యప మహర్షుల జ్ఞాన ఫలాలు నేటికీ సమాజాన్ని ధర్మమార్గంలో పయనింపజేస్తూ సమాజాన్ని ఆలయ వ్యవస్థతో అనుసంథానం గావించిందని చెప్పారు. మానవాళిని మహోన్నత స్థితికి చేర్చే ఆరాధనా విధానం శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథం లో వివరించారని తెలిపారు. ఈ సభలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆచార్యులు, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర పండితులు పాల్గొన్నారు.