శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కల్యాణోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఇక నిన్న ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ రెండో రోజు కాబట్టి స్వామివారు హనుమంత వాహనంపై విహరించనున్నారు. మూడో రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.