తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల కాలం నాటిది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో భక్తులను ఆకట్టుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. తిరుమల వెళ్లే యాత్రికులు తప్పక ఇక్కడ గోవిందరాజ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వేలాది మంది యాత్రికులతో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.