శ్రావణ మాసం సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విశాఖలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలోశ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రావణమాసంలోని నాలుగు శుక్రవారాల్లోనూ వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవాలయము నందు జరుగు నాలుగు శుక్రవారములలో శ్రీ సింహవల్లితాయర్ (లక్ష్మీదేవి) అమ్మవారికి ఆర్జిత లక్ష కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకూ శ్రీ సింహవల్లితాయర్ సన్నిధి వద్ద ఆర్జిత లక్ష కుంకుమార్చన టికెట్ రూ. 2500 చెల్లించి పూజలో పాల్గొనవచ్చును. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.00 గంటల వరకూ సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరుగనుంది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారి కోసం టికెట్‌ను రూ.500గా నిర్ధారించారు. కాబట్టి కుంకుమార్చనలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఆయా పూజను బట్టి టికెట్ కొనుగోలు చేసి ప్రత్యక్షముగాపాల్గొనవచ్చు.