కళారాలకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు..

దసరా ఉత్సవాలను ఒక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే పలు విధాలుగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కళారాలను ఊరేగిస్తారు. అసలు కళారాలు అంటే ఏంటి అంటారా? ఒక పెద్ద ముఖాకృతినే కళారాలు అని పిలుస్తారు. ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఈ కళారాలలో కాళికాదేవి, మహిషాసుర మర్ధిని, నరసింహ స్వామికి చెందినవి ఉన్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజలు చేస్తారు. తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు.

కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీరను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్ర రూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు చెబుతారు. గర్భిణులను ఆ ఉత్సవం వైపునకు రానివ్వరు. ఇలా కళారాన్ని ఊరి నడిమధ్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.

Share this post with your friends