
తిరుమలలో కార్తీక మాస మహోత్సవాలు ఇంకా ముగియలేదు. కార్తీక మాస కార్యక్రమాలు ఏవో ఒకటి నిర్వహిస్తూనే ఉన్నారు. తిరుమల మొదటి కనుమ రహదారిలోనూ తాజాగా కార్తీక మాస పూజ ఘనంగా నిర్వహించారు. తిరుమల కనుమ రహదారిలోని అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
