శంకరుల స్తోత్రమాలా మణిపూసలలో కొన్ని మీకోసం..

సనాతన ధర్మంలో ఎందరో దేవతామూర్తులున్నారు. ఆయా దేవతలను ఇష్టదైవాలుగా కలిగి ఉన్నవారు ఉన్నారు. అయితే ఏ దేవుణ్ని ఆరాధించినా తరించవచ్చని, అందరు దేవతలు సమానమేనని ఆయా దేవతా మూర్తులను ఆరాధించేందుకు వీలైన స్తోత్రాలను రచించి మానవాళికందించిన ఆ శంకరుని అపరావతారమే ఆదిశంకరాచార్యులు. ఈనాడు మనం నిత్యం చదివే స్తోత్రాలలో ఆదిశంకర కృతమైనవి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన రచించిన ప్రతి శ్లోకం ఒక మహామంత్రం. ఆయన రచించిన స్త్రోత్ర సాహిత్యంలో కొన్ని వాటి గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం.

బాలబోధ సంగ్రహం

ఇది తోటి పిల్లలకు నీతినీ, ధర్మాన్ని తెలిపే సరళ భాషా స్తోత్రము. ఇది శంకరుని తొలి రచన.

కనకధారాస్తవం

ఉపనయనానంతరం ఒక బ్రాహ్మణి కటిక పేదరికాన్ని చూసి కరిగి ఒక ఉసిరికాయను భిక్షగా స్వీకరించి సిరుల తల్లిని ఈ స్తోత్రంతో ప్రసన్నురాలిని చేశారు. ఈ స్తోత్రం చేసిన వెంటనే ఆ తల్లి సంపదలు వర్షింపజేసింది.

అచ్యుతాష్టకం

భగవంతుని ధ్యాస ఎక్కువైన తల్లి ఆర్యాంబ కోసం అచ్యుతాష్టకం రచించి దాని అర్థాన్ని తల్లికి వినిపించి పునీతులను చేశారు.

శ్రీకృష్ణాష్టకం

తల్లి ఆర్యాంబకు జగద్గురువైన శ్రీకృష్ణభగవానుడంటే ఇష్టమని ఈ అష్టకాన్ని రచించి వినిపించారు. భక్తితో వింటూ భగవంతునిలో లీనమైపోయింది ఆ మాతృమూర్తి.

నర్మదాష్టకం

తన లక్ష్య సాధనకై పయనించే వేళ వరదలతో ప్రజలను ముంచెత్తుతున్న నర్మదానదిని కీర్తించిన స్తోత్రమిది. దానితో ఆ నది శాంతించింది.

Share this post with your friends