మట్టితో అమ్మవారిని తయారు చేసి పూజలు నిర్వహించి ఆపై..

వినాయక చవితి పండుగ రోజు చాలా మంది ఈకో ఫ్రెండ్లీ పేరిట మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తారు. ఇవి కొనుక్కుని రావడమో లేదంటే స్వయంగా ఇంట్లోనే బంకమన్ను తీసుకొచ్చి తయారు చేయడమో చేస్తుంటారు. అలాగే ఏదైనా పూజలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి ప్రతిష్టించి పూజించుకుంటాం. ఇలాగే ఓ చోట మట్టితో అమ్మవారిని తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. అసలు అదెక్కడ? ఎందుకు అమ్మవారిని మట్టితో తయారు చేస్తారు? అసలెప్పుడు తయారు చేస్తారు? వంటి విషయాలను తెలుసుకుందాం.

ఏపీలోని కొల్లేరులో అమ్మవారిని మట్టితో తయారు చేస్తారు. అదెప్పుడంటే చేతికొచ్చిన పంటను కోసే ముందు. గట్టుపై పెద్ధింట్లమ్మను మట్టితో తయారు చేసి.. పొంగళ్లు తయారు చేసి ఆ విగ్రహానికి పూజలు చేసి కోడిని కోసుకుని అందరూ అక్కడే భోజనాలు చేసి కోతలకు సిద్ధమవుతారు. ఇది ఎప్పటి నుంచో కొల్లేరు ప్రాంతంలో ఆనవాయతీ గా వస్తుంది. కొల్లేరు ప్రాంతంలో ని కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటి కోట గ్రామంలో పెద్ధింట్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఇక్కడి వారంతా ఈ అమ్మవారిని తమ ఇలవేల్పుగా పూజిస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారు పద్మాసనం లో కూర్చుని దర్శనమిస్తుంది. ప్రతిఏటా ఇక్కడ నిర్వహించే జాతరకు అన్ని ప్రాంతాల నుంచి ప్రభలు కట్టుకుని మరీ వస్తుంటారు.

Share this post with your friends