సిరిమానోత్సవం తేదీలు ఫిక్స్.. ఎప్పుడు ప్రారంభం కానుందంటే..

ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ పైడితల్లి సిరిమాను పండుగ. ఉత్తరాంధ్రవాసులకు ఇదొక పెద్ద పండుగ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరుగుతుంది. ఈ పండుగకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పండుగ నలభై రోజుల పాటు సాగుతుంది. ఈ పండుగ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పండుగ సెప్టెంబర్ 20 భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ప్రారంభమవనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అమ్మవారికి పండుగ రాట వేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు.

ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15న నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. దానికి ముందు అంటే అక్టోబర్ 14 న అమ్మవారి తొల్లెళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 22వ తేదీ మంగళవారం పెద్దచెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, అక్టోబర్ 29న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 30న బుధవారం వనం గుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రధాన ఘట్టం అందరికీ తెలిసిందే. ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిస్తారు.

Share this post with your friends