విశాఖపట్టణంలోని సింహాచలంలో ప్రసిద్ధి గాంచిన దేవస్థానాల్లో ఒకటి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. విశాఖ నగరం నుంచి 11 కి.మీ దూరంలో తూర్పు కనుమలపైన వరాహ లక్ష్మీనరసింహస్వామివారు కొలువయ్యారు. సింహాద్రి అప్పన్నగా స్వామివారు చాలా ప్రాముఖ్యం పొందారు. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో సింహగిరి పర్వతంపై ఈ ఆలయం ఉంది. ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I.. కళింగ వాస్తు శిల్పం ప్రకారం 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయాల్లో ఇదొకటి.
ఈ నెల 19వ తేదీన స్వామివారి రథోత్సవంతో పాటు కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. దీనికి దేవస్థానం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా 19వ తేదీన స్వామివారి ఉదయం 6:30 నుంచి 7:30 వరకూ స్వామివారి ఎదురు సన్నాహోత్సవము.. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ రథోత్సవము నిర్వహించనున్నారు. రాత్రి 9:30 గంటలకు స్వామివారి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులు టీవీలో వీక్షించవచ్చు.