అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక దాత శ్రీవారి కోసం దాదాపు రూ.5 లక్షల విలువ చేసే వెండి వస్తువులను విరాళంగా అందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన సుమారు రూ.5 లక్షల విలువైన వెండి పాదుకలు, వెండి కిరిటం, వరద హస్తం, కఠి హస్తం మరికొన్ని అభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టీటీడీకి విరాళంగా అందజేశారు.
అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర..
ఈ క్రమంలోనే మరో భక్తుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను శ్రీవారికి కానుకగా అందజేశాడు. తిరుమల శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీరను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. ప్రతి ఏడాది తన తండ్రి స్ఫూర్తితో వేములవాడ రాజరాజేశ్వరి దేవికి అలాగే తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్టు విజయ్ తెలిపారు. కాగా.. ఇవాళ తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు.