వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్బంగా శుక్రవారం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి గరుడ సేవను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు. ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారంను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీకాసులహారానికి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీ రమేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 17 న ప్రారంభమయ్యాయి. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 17 నుంచి ఉదయం, సాయంత్రం వాహన సేవలు నిర్వహిస్తూ వస్తున్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల‌కు 16న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. ముందుగా మేదినిపూజ ఆపై సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్స‌వం ద్వారా శ్రీ విష్వక్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్రహ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్యవేక్షిస్తార‌ని ప్రతీతి.

Share this post with your friends