భారతదేశంలో ఆలయాలకు కొదువ లేదు. అయితే కొన్ని పురాతన ఆలయాల్లో కొన్ని సైన్స్ కూడా ఛేదించలేని మిస్టరీ ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో షికారి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఇంజెహాలి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో మార్కండేయ మహర్షి తపస్సు చేశాడట. మార్కండేయ మహర్షి తపస్సుకు మెచ్చిన దుర్గాదేవి.. ఆయన కోరిక మేరకు శక్తి రూపంలో ఈ ప్రదేశంలో స్థిరపడిందని చెబుతారు. ఈ ఆలయంలో 64 మంది యోగిలు కలిసి కూర్చొన్నారు. అందుకే షికారీ మాతను యోగి మాత అని కూడా పిలుస్తారు.
నవదుర్గా దేవి, చాముండ, కమ్రునాగ మందిరం, పరశురాముని విగ్రహాలు సైతం షికారి మాత ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయ రహస్యం ఏంటంటారా? పైకప్పు లేకపోవడమే. ఈ ఆలయం పైకప్పును నిర్మించేందుకు చాలా సార్లు యత్నించారట. కానీ ప్రయోజనం శూన్యం. నిర్మించిన కూడా ఆలయ గోడలపై పైకప్పు నిలిచిందే లేదు. అమ్మవారు పైకప్పు లేకుండా ఉండేందుకే ఇష్టపడతారని అక్కడి వారంతా భావిస్తారు. ఇక ఈ షికారి శిఖర కొండలపై శీతాకాలంలో మంచు గడ్డ కడుతుంది. అయినా సరే.. అమ్మవారిని మాత్రం మంచు టచ్ చేయదట. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పాండవులు ప్రతిష్టించారని ప్రతీతి. పాండవులు ఈ ఆలయాన్ని వారి వనవాస సమయంలో కొంత మేర నిర్మించి మరో ప్రాంతానికి వెళ్లిపోయారట. అప్పుడు ఆగిన నిర్మాణం నేటికీ పూర్తి కాలేదట.