ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు..

దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి సైతం శరన్నవరాత్రి ఉత్సవాల కోసం సిద్ధమైంది. ఇవాళ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. అలాగే అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా లేజర్ షోతో పాటు కృష్ణానదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు.

ఈసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇక రేపటి నుంచి తెల్లవారు జామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. మహా నివేదన సమయంలో కాసేపు దర్శనాల విరామం.. ఆ తరువాత ఖడ్గమాల ప్రత్యేక కుంకుమర్చనలు ఉంటాయి. ఇక నిత్యం 9 గంటలకు చండియాగం నిర్వహిస్తారు. ఈ నెల 12న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. వికలాంగుల కోసం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుని కల్పిస్తున్నారు.

Share this post with your friends