మహా కుంభమేళా 2025.. ప్రస్తుతం ప్రపంచమంతా మహాకుంభమేళా వైపే చూస్తోంది. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్నారు. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకూ కొనసాగనుంది. విభుడు, దేవాధిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో కొన్ని ముఖ్య రోజులున్నాయి. ఆయా రోజుల్లో స్నానమాచరిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా దివి నుంచి దేవతలు సైతం కిందకు వచ్చి మహాకుంభమేళాలో స్నానమాచరిస్తారట. నాగ సాధువులు, అఖారాలు పెద్ద ఎత్తున వచ్చి స్నానమాచరిస్తున్నారు.
అయితే మహాకుంభమేళాలో 28 నుంచి ఒక లెక్క.. ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. అసలు 29న మహాకుంభమేళాలో ఏం జరుగనుంది అంటారా? అక్కడే కాదు.. తిథుల పరంగా 29న మౌని అమావాస్య. ఈ క్రమంలోనే మహాకుంభమేళ పరంగా చాలా ప్రత్యేకమైన రోజు. బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం. ఈ రోజున మహాకుంభమేళాలో స్నానమాచరిస్తే చాలా పుణ్యం లభిస్తుందట. సాధారణంగానే ఈ రోజున నదీ స్నానం చాలా మంచిది. ఈ క్రమంలోనే మహాకుంభమేళాలో స్నానమాచరిస్తే ఫలితం మరింత అద్భుతంగా ఉంటుంది. మౌని అమావాస్య రోజున అందరూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ షాహి స్నాన్ ఆచరిస్తారు. అనంతరం పితృదేవతలకు నీరాజనాలు అర్పిస్తే పూర్వీకులకు సద్గతులు కలిగి సకల శుభాలు కలుగుతాయట.