భక్తులు ఎక్కువగా దర్శించుకునే ఆలయాల్లో శ్రీశైలం కడా ఒకటి. శ్రీశైలంలో రెండు విశేషాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా చూడటమే కాకుండా అష్టాదశ అమ్మవారి ఆలయాల్లోనూ ఒకటి కావడంతో ఈ ఆలయనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వెలిసిన శివయ్య మల్లికార్జునుడిగానూ.. అమ్మవారు బ్రమరాంబగానూ పూజలందుకుంటోంది. అయితే శ్రీశైలం మహా క్షేత్రంలో దేవాదాయ శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆది దంపతుల దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తుంటారు. ఆ సమయంలో అన్యమత ప్రచారం వారిని ఇబ్బంది పెడుతోంది.
ఈ క్రమంలోనే శ్రీశైలం దేవస్థానం సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ విషయాన్ని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అన్యమత సూక్తులను మాత్రమే కాకుండా చిహ్నాలను, భోదనలను, అన్యమతానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కలిగి ఉన్నా కూడా ఆ వాహనాను శ్రీశైల క్షేత్ర పరిధిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అన్యమత ప్రచారం నిర్వహిస్తే శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.