దసరా పండుగ ఇతర పండుగల మాదిరిగా కాదు.. ఈ రోజున మనం తప్పక రెండు పనులు చేస్తాం. అవేంటంటే.. జమ్మి చెట్టును పూజించుకోవడం.. అలాగే పాలపిట్టను దర్శించుకోవడం. నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్ట చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ఉంటుంది. వాస్తవానికి పాలపిట్టను మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగానూ.. మరికొందరు పరమేశ్వరుడి స్వరూపంగానూ భావిస్తారని ముందుగానే తెలుసుకున్నాం. అందుకే పాలపిట్టను దర్శించుకుంటూ ఉంటారు. అయితే దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.
త్రేతా యుగంలో సీతమ్మను రావణుసురుడు అపహరించిన విషయం తెలిసిందే. సీతమ్మ జాడ కనుక్కొన్న ఆంజనేయుడు శ్రీరాముడికి విషయం చెప్పడంతో రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో విజయ దశమి రోజున రామయ్యకు పాలపిట్ట ఎదురుగా కనిపించిందట. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు. దీంతో పాలపిట్టను శ్రీరామ చంద్రుడు శుభశకునంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద దాచి.. అజ్ఞాత వాసానికి వెళతారు ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి.