విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని వివిధ రకాలైన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. కూరగాయలు, ఆకుకూరల అలంకరణ నడుమ అమ్మవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. అమ్మవారి మూల విరాట్‌ను మాత్రమే కాకుండా ఆలయంలో ఇతర దేవతామూర్తులు సహా ఆలయాన్ని.. ఆలయ ప్రాంగణమంతా వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నారు.
ఈ కూరగాయలన్నింటినీ ప్రతి ఏటా దాతలే సమర్పిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ 25 టన్నులు పైగా ఆకు కూరలు, కూరగాయలను దాతలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారుచేసి భక్తులకు పంచి పెడుతూ ఉంటారు. ఈ శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. లోకం సస్యశ్యామలంగా ఉండడానికి.. పాడిపంటలతో ఉండడానికి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఉండడానికి ఆషాడమాసంలో ఈ శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. శుక్రవారం కావడంతో శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు పోటెత్తారు.