అమావాస్య రోజున అసలు ఏ పనీ చేపట్టరు. అయితే ఇది దేవతలకు మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం అని చెబుతారు. రాష్ట్రంలోని కొన్ని క్షేత్రాలలో ఒక్క అమావాస్య రోజు అమ్మవారికి అభిషేకంతో పాటు కుంకుమ పూజ వంటి కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో అతి ముఖ్యమైన ఆలయం ఒకటుంది. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి ఒక్క అమావాస్య రోజున సహస్ర అంటే 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారిని అలా అభిషేకిస్తే చాలా మంచి జరుగుతుందట. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది అంటారా?
కాకినాడ జిల్లా, తుని మండల కేంద్రంలోని తునికి 5 కి.మీ దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇక్కడ స్వయంభువుగా శ్రీ తలుపులమ్మ తల్లి వెలిసింది. ఏడాదిలో అత్యంత ఘనంగా అమ్మవారికి ఆషాడ మాసం మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఆషాడమాసం మహోత్సవాల చివరి రోజు తరువాత అంటే అమావాస్య రోజున అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. దీనికి ముందు రెండు రోజుల పాటు కలశాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిండు అమావాస్య నాడు ఉదయం దాదాపు 10 గంటల సమయంలో అమ్మవారి మూల విరాట్‌తో పాటు అమ్మవారి దివ్య క్షేత్రంలో ఉన్న ఉత్సవమూర్తులకు సైతం అభిషేకం నిర్వహిస్తారు.