శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉద‌యం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహ‌న్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య‌ పాల్గొన్నారు.

Share this post with your friends