భక్తులకు ఎలాంటి అసౌకర్యంకుండా శ్రీవారి బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్షా

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో గురువారం ఈవో శ్రీ జె శ్యామలరావు, జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు మరియు ఇతర శాఖలతో భద్రత మరియు రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముఖ్యమైన అంశాలు:

గత రెండేళ్లుగా తిరుమలలో వాహనాల రాకపోకలు పెరగడంతో వాహనాలకు పార్కింగ్‌ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, గరుడ సేవ రోజున భక్తులను తిరుమలకు తరలించడానికి ఏపిఎస్ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులను నడపాలి. అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయక నగర్ క్వార్టర్స్‌లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ప్రైవేట్ జీపులు, కార్లు సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలు, ఎస్వీ జూ పక్కనే ఉన్న దేవలోక్‌లో ప్రైవేట్ బస్సుల కొరకు పార్కింగ్ ఏర్పాటు. అదేవిధంగా చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్, లగేజీ సెంటర్‌ను ప్రస్తుతం ఉన్న కామన్ కమాండ్ సెంటర్ పాయింట్ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు సేవా సదన్ 1 మరియు 2 ఎదురుగా మార్చడం, అన్నప్రసాదం పంపిణీతో పాటు అన్నప్రసాదాన్ని గ్యాలరీలకు తరలించే వాహనాల రూట్ మ్యాప్ రూపొందించడంతో సహా ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించారు. నాలుగు మాడ వీధులలో ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరణ, యాత్రికుల కొరకు మరిన్ని మే ఐ హెల్ప్ యూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇంకా సాంస్కృతిక బృందాలు, సిమ్స్, రుయా, బర్డ్ నుండి అదనపు వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందిని నియమించడం, తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్య పనులు మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో తిరుపతిలో కూడా పారిశుద్ధ్య పనుల విస్తృత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్, టిటిడిలోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం నుండి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీ చెంగల్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends