రథసప్తమి వేడుకలు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున వాహన సేవలను నిర్వహించడం జరిగింది. నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సూర్యుని కిరణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామి, అమ్మవార్లపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యప్రభ, చిన్నశేష, పల్లకీ, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నారాయణ పాల్గొన్నారు.