తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. తిరుమలలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున రథసప్తమి వేడుకలు జరుగుతుంటాయి. దీనికోసం కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి స్వామివారికి వాహన సేవలు జరుగుతున్నాయి. నేడు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమల శ్రీవారి వాహన సేవలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ వాహన సేవలను తిలకించేందుకు భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు వాహనాలపై ఊరేగనున్నారు. రథసప్తమికి రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రత కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ భక్తుల కోసం షెడ్లు ఏర్పాటు చేసింది. ఆలయ మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తోంది. రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగనుంది.