తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఏవీ రమణ దీక్షితులును తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల దానిని సవాల్ చేస్తూ రమణ దీక్షితులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది నిన్న విచారణకు వచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో ఉన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి… తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులును బాధ్యతల నుంచి తప్పిస్తూ ఈ ఏడాది మార్చి 2న ప్రొసిడింగ్స్ జారీ చేశారు. దీనిని రమణ దీక్షితులు హైకోర్టులో సవాల్ చేయగా పిటిషనర్ తరుఫున న్యాయవాది శీతిరాజు శ్యాంసుందర్ వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించారని.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని శీతిరాజు పేర్కొన్నారు. ఈవో ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి రమణదీక్షితులు ప్రధాన అర్చకుడిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.