అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. జూలై 22వ తేదీన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 21న సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూలై 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.