పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందన్న విషయం తెలిసిందే. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అత్యంత ఇష్టమైన పౌర్ణమి గరుడసేవ ఇవాళ జరుగనుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తాడట. కాబట్టి ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్నారు. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఇక ఇవాళ తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోనూ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి విశ్వాసం. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.