వినాయక చవితి వచ్చేస్తుంది. ఇంట్లో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే వినాయక విగ్రహాలను ఎలా పడితే అలా పెట్టకూడదు. సరైన దిశలో పెడితే ఫలితం చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. ఇక వినాయక చవితి నాడు గణపతితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించుకుని పూజ చేస్తే చాలా మంచిదట. గణేషుడు జ్ఞానానికి అధినేత అయితే.. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు అధి దేవతగా భావిస్తూ ఉంటాం కాబట్టి పూజ గదిలో ఇద్దరి విగ్రహాలను పెట్టుకోవాలి. ఇక లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలను పూజగదిలో ఒకచోట పెట్టాలి.
పూజ గదిలో గణపతి, లక్ష్మీదేవి ఉత్తరం వైపున ఉంచాలని పండితులు చెబుతున్నారు. దీనికి కారణం ఏంటంటే.. పార్వతీ మాత గణేశుడిని పిండి ముద్దతో తయారు చేసి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్లిందట. అప్పడు శివుడు రాగా.. ఆయనను వినాయకుడు అడ్డుకున్నాడు. కోపంతో గణేషుడి తలను శివయ్య అతని శరీరం నుంచి వేరు చేశాడు. ఆ తరువాత పార్వతీ మాత ద్వారా తన కొడుకని తెలుసుకున్న శివయ్య.. శివగణాలను ఉత్తర దిశకు పంపించి ఆ దిశలో కనిపించే తొలి జీవి తలను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆ శివ గణాలు తమకు ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తల నరికి తెచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఉత్తర దిశలోనే వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలని అంటారు. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని.. గణేషుడికి కుడి వైపున ఉంచాలి. ఎడమ వైపున పెడితే ఆర్థిక పరిస్థితి దిగజారుతుందట.