పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అన్నామలైగా పిలుచుకునే ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అంటే వివిధ అర్థాలున్నాయి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ.. ఇలా చూస్తే ఎర్రని కొండ అని అర్థం. దైవశాస్త్రాల ప్రకారం అ-రుణ అంటే పాపాలను సంహరించేదని అర్థం. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలూ పోతాయని నమ్మకం. పురాణాల ప్రకారం.. పరమశివుడు భూమిపై జరుగుతున్న అన్యాయాలను, పాపాలను నిర్మూలించాలని భావించాడట. ఆ వెంటనే అరుణాచలం ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించాడట.
శివుని ఆజ్ఞానుసారమే విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబతారు. ఈ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి పూజా విధానాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. శివుని జ్యోతిర్లింగాలలో అరుణాచలం సైతం ఒకటిగా పరిగణించడం జరుగుతోంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం వలన సాక్షాత్తు శివునికే ప్రదక్షిణలు చేసిన పుణ్యం లభిస్తుందట. గిరిప్రదక్షిణతో శివుని అనుగ్రహం లభించడంతో పాటు పూర్వం చేసిన పాపాలన్నీ తొలగిపోయి కర్మల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు.