కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకూ పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబరు 28వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేయాధివాసం, సెప్టెంబరు 29న ఉదయం స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబరు 30న ఉదయం హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఆలయ ప్రాశస్త్యం..
చిత్తూరు జిల్లా గంగవరం మండలం, కీలపట్ల గ్రామంలో వెలసిన శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం అతి పురాతనమైన, చారిత్రక ప్రసిద్ధి కలిగిన దేవాలయం. భృగుమహర్షి స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించగా, ఆర్జునుని మునిమనమడు జనమేజయ మహారాజు గుడి కట్టించారు. చోళ, పల్లవ, విజయనగర రాజుల ఏలుబడిలో విశేష పూజలు అందుకున్నారు. అనంతరం మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి గ్రామస్థులు స్వామివారిని కోనేటిలో దాచి ఉంచినారు. ఆ తరువాత కాలంలో చంద్రగిరి సంస్థానాధీసులకు స్వామివారు కలలో సాక్షాత్కరించగా, కోనేటిలోనున్న స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించారు. ఈ విధంగా కోనేటి నుండి ప్రతిష్ఠ చేయబడింది కావున కోనేటి రాయస్వామిగా ప్రసిద్ధి చెందినారు. అన్నమయ్య కీర్తనలలోని కోనేటిరాయస్వామి ఆలయం ఈ గ్రామంలో మాత్రమే ఉన్నది. తరువాత కాలంలో పుంగనూరు జమీందార్లు నిత్య కైంకర్యాలకు మాన్యాలను సమకూర్చారు.