పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వేద పండితులు ఘనంగా ముగింపు పలికారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది.

ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహ‌న్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Share this post with your friends