తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదారులైన తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి. శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు.
అంతకు ముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలంపించారు. తరువాత శ్రీ మలయప్ప స్వామివారి తరపున కొందరు అర్చకులు ముందునకు కొంత దూరము పరుగెత్తి మూడుసార్లు ఈటెను విసరడం జరిగింది. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీఓ శ్రీ లోకనాథం, ముఖ్య అర్చకులు శ్రీ కిరణ్ స్వామి, పేష్కార్ శ్రీ రామకృష్ణ, పారుపత్తేదారు శ్రీ బాలసుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.