తిరుమలలో బుధవారం నాడు పల్లవోత్సవం వైభవంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెష్కర్ శ్రీ శ్రీహరి, పడి కావలి ఏఈఓ శ్రీ మోహన్ రాజు, ఇతర అధికారులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 73.023 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీ మలయప్ప స్వామివారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.