
దసరా ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.అయితే ఉత్సవాలు ఒక్కోచోట ఒక్కోలా నిర్వహిస్తున్నారు. ఏపీలోనే జిల్లాకు ఒకలా నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుంచి ఏనుగు సంబరాలు జరపడం ఆచారంగా వస్తోంది. దసరా మొదటి రోజున ఏనుగు గుడిలో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే మరెవరో కాదు.. వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు.
ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్ఠలను ఆచరిస్తాడు. మొదటి రోజు నుంచి వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగుపై అంబారీని అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితం పూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ ఏర్పాటు చేస్తారు. అలాగే ఒక చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుంచి దాటిస్తారు. అలా దాటిస్తే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దాని నుంచి బయట పడతారని విశ్వాసం. రాత్రి ఆరు గంటలకు ఊరేగింపు ప్రారంభించి తెల్లవారి ఆరు గంటల వరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.
