కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9.30 – 10.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
29-01-2025
ఉదయం – ధ్వజారోహణం,
రాత్రి – చంద్రప్రభ వాహనం.
30-01-2025
ఉదయం – సూర్యప్రభవాహనం,
రాత్రి – పెద్దశేష వాహనం.
31-01-2025
ఉదయం – చిన్నశేష వాహనం,
రాత్రి – సింహ వాహనం.
01-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – హనుమంత వాహనం.
02-02-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – గరుడ వాహనం.
03-02-2025
ఉదయం – కల్యాణోత్సవం,
రాత్రి – గజవాహనం.
04-02-2025
ఉదయం – రథోత్సవం,
రాత్రి – ధూళి ఉత్సవం.
05-02-2025
ఉదయం – సర్వభూపాల వాహనం,
రాత్రి – అశ్వ వాహనం.
06-02-2025
ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం,
రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.
ఫిబ్రవరి 3న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటల నుండి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.