తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని జెఈఓ కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 28న ధ్వజారోహణం, డిసెంబర్ 2న గజ వాహనం, 3న స్వర్ణరథం, గరుడ వాహనం, 6న పంచమితీర్థం, 7న పుష్పయాగం నిర్వహిస్తారని చెప్పారు.
విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు. ఇందుకోసం టీటీడీ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను ఆయన సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అదనపు ఆరోగ్యశాఖ అధికారి శ్రీ సునీల్ కుమార్, విజివో శ్రీ బలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.