బాసరలోనే కాదు.. అయోధ్య రామయ్యనూ దోచేసిన దొంగలు

బాసర సరస్వతీదేవి ఆలయంలో హుండీలోని నగదు కానుకలతో పాటు ప్రసాద కేంద్రంలోని సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక అయోధ్యలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అయోధ్య రామాల‌య నిర్మాణం అనంత‌రం మందిర ప‌రిస‌ర ప్రాంతాల‌ను అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున లైటింగ్‌తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. భ‌క్తిప‌థం, రామ‌ప‌థం మార్గాల్లో 6,400 వెదురు లైట్లు, భక్తి ప‌థంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 3,800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దొంగలు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.50ల‌క్షల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచనా.

వాస్తవానికి ఇది కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఆల‌య ట్రస్టు పోలీసుల‌కు ఈ నెల 9న కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఫిర్యాదు చేశారు. అయితే వెలుగులోకి మాత్రం తాజాగా వ‌చ్చింది.
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి. మార్చి వరకూ అన్ని లైట్లూ ఉన్నాయట. మే 9 నుంచి చోరీ ప్రారంభమైందట. క్రమక్రమంగా లైట్లు దొంగిలిస్తూ వచ్చారట. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.50 లక్షల విలువైన 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో దుండ‌గులు దొంగిలించారని సదరు కాంట్రాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Share this post with your friends