ఈ ఆలయంలోని అమ్మవారికి నూడిల్సే నైవేద్యం

భారతదేశంలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని ఆలయాల్లో ప్రసాదం అద్భుతంగా ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ప్రసాదం ఆశ్చర్యంగానూ వింతగొలుపుతుంది. ఓ ఆలయంలో చాక్లెట్స్‌ను నైవేద్యంగా సమర్పిస్తే మరో ఆలయంలో బిర్యానీని నైవేద్యంగా పెడతారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో చైనీస్ ఫుడ్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు ఆ ఆలయం ఎక్కడుందో ముందుగా తెలుసుకుందాం. కోల్‌కతా నగరంలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిల్లోని ఒక ఆలయంలో నూడిల్స్‌ను నైవేద్యంగా పెడతారు.

కోల్‌కతాలోని టెంగ్రా ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇది కాళీ మాత ఆలయం. దీనిని చైనీస్ కాళి ఆలయంగా కూడా పిలుస్తారు. అసలు ఈ ప్రాంతమే చైనా టౌన్ పేరుతో ప్రఖ్యాతి గాంచింది. చైనీస్ కాళి ఆలయం 60 ఏళ్ల నాటిదని చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని హిందువులే కాకుండా ఇక్కడి చైనా ప్రజలు కూడా పుజించడంతో చైనీస్ కాళీ మాత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అప్పట్లో ఇక్కడ ఒక చెట్టు కింద రాళ్లపై సింధూరం పూసి పూజలు చేసేవారట. ఆ తరువాత కొన్నాళ్లకు ఆలయాన్ని నిర్మించి కాళీ మాతను ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ ప్రసాదంగా చైనీస్ ఆహారమే లభిస్తుంది.

Share this post with your friends