
రాజస్థాన్లోని ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఉన్న దుర్గాదేవి స్వరూపమైన ఇడాన మాత ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇదొక సాధారణ ఆలయం కాదని కూడా ముందుగానే చెప్పుకున్నాం. ఇది మేవార్ శక్తి పీఠమని చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారు అగ్ని స్నానం చేస్తారని.. ఎప్పుడు మంటలు చెలరేగుతాయనేది కూడా ఎవరికీ తెలియదని చెబుతారు. అగ్ని చెలరేగిన సమయంలో అమ్మవారిపై ఉండే దుస్తులు, అలంకరణ వస్తువులన్నీ దహనమవుతాయి. ఆసక్తికరంగా అమ్మవారి విగ్రహానికి మాత్రం మసి అనేదే ఉండదట.
దీనినే భక్తులంతా అమ్మవారి అగ్ని స్నానంగా పిలుస్తారు. అసలు ఎందుకు సడెన్గా అలా మంటలు చెలరేగుతాయనే దానికి స్థానికులు చెప్పేదేంటంటే.. అమ్మవారి శక్తి మేల్కొన్నప్పుడు అగ్ని ఆకస్మికంగానే కనిపిస్తుందని చెబుతారు. అగ్ని చెలరేగించడం ద్వారా అమ్మవారు తనను తాను స్వయంగా శుద్ధి చేసుకుంటుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో పొరపాటున కూడా అగరుబత్తులు లేదా ఇతర మండే పదార్థాలను ఎప్పుడూ వెలిగించరు. ఎందుకంటే అగ్ని.. దేవత సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుందని నమ్ముతారు.
